ట్రాయ్ ఛైర్మన్‌ ఖాతాలో రూపాయి జమ చేసిన హ్యాకర్లు


      దిల్లీ: భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్‌) ఛైర్మన్‌ ఆర్‌.ఎస్‌.శర్మ ట్విటర్‌లో వెల్లడించిన ఆధార్‌ సంఖ్య ఆధారంగా ఆయనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నింటినీ ఫ్రెంచి భ్రదత నిపుణుడు, ఎథికల్‌ హ్యాకర్‌ ఇలియట్‌ అండర్సన్‌ బయటపెట్టిన విషయం తెలిసిందే. శర్మ బ్యాంకు వివరాలన్నీ బహిర్గతం కావడంతో పలువురు నెటిజన్లతో పాటు హ్యాకర్లు పేటీఎం, భీమ్‌ యాప్‌ ద్వారా ఒక రూపాయిని ఆయన ఖాతాలో వేశారు. నెటిజన్లు ఆయన బ్యాంకు ఖాతాకు రూపాయి జమ చేసినట్లు ఉన్న సమాచారాన్ని ట్విటర్‌లో కూడా పోస్టు చేశారు.

     మరికొంతమంది నెటిజన్లు ఆయన వివరాలతో నకిలీ ప్రభుత్వ ఐడీలను, నకిలీ ఆధార్‌ కార్డును తయారు చేశారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ, కొటక్‌ మహీంద్రా బ్యాంకుల్లోని శర్మ ఖాతా వివరాలను ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను హ్యాకర్లు బహిర్గత పరిచారు. యూజర్ల వ్యక్తిగత వివరాలను మరింత భద్రంగా ఉండేలా చేసేందుకు మీకు భీమ్‌ యాప్‌ ద్వారా రూపాయిను విరాళంగా పంపిస్తున్నాంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

   శర్మ ఆదివారం తన ఆధార్‌ నెంబర్‌ను ట్విటర్‌లో పోస్టు చేస్తూ అది ఎలా దుర్వినియోగం అవుతుందో తెలపాలని సవాలు విసిరారు. వెంటనే ఫ్రెంచి హ్యాకర్‌ అండర్సన్‌ శర్మ బ్యాంకు వివరాలు, ఈమెయిల్‌ ఐడీ, పాన్‌ కార్డు సమాచారం, ఫోన్‌ నెంబరు, వాట్సాప్‌ ప్రస్తుతమున్న డీపీతో పాటు పలు వ్యక్తిగత వివరాలను బయటపెట్టాడు. అయితే.. అండర్సన్‌ బయటపెట్టిన వివరాలను భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్‌ ఖండించింది. ఆ వివరాలు తప్పు అని స్పష్టం చేసింది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment