శ్రీవారి దర్శనం బంద్‌!

వచ్చేనెల 12నుంచి 16వరకూ మహాసంప్రోక్షణ
9 సాయంత్రం 6గంటలకు క్యూలైన్ల మూసివేత
ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేకు దర్శనాలూ రద్దు
17 ఉదయం 6గంటలకు దర్శనం పునరుద్ధరణ
భక్తులు తిరుమలకు రావచ్చు: టీటీడీ చైర్మన్‌ పుట్టా

తిరుమల, జూలై 14  అష్టబంధన బాలాలయ మహోసంప్రోక్షణను పురస్కరించుకొని టీటీడీ శ్రీవారి దర్శనాన్ని ఆరు రోజులపాటు రద్దు చేసింది. శనివారం నిర్వహించిన టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ ప్రకటించారు. ఆగస్టు 12 నుంచి 16వరకు నిర్వహించనున్న మహాసంప్రోక్షణలో భాగంగా హోమాలు, వైదిక కార్యక్రమాల కారణంగా మూలవర్ల దర్శనం సాధ్యపడదని అర్చకులు తెలియజేసినందున ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆ సమయంలో స్వామి దివ్యతేజం మూలమూర్తిలో ఉండదు కనుక భక్తులు దర్శించుకున్నా ఫలితం ఉండదని ఆగమ పండితులు చెప్పడంతో దర్శనాలు పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు. మహాసంప్రోక్షణ సమయంలో రోజుకు సుమారు 20నుంచి 25వేల మందికి మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉందన్నారు. అయితే వారాంతం, ఆగస్టు 15 సెలవుదినం కారణంగా లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దర్శనాలు పూర్తిగా రద్దుచేస్తే ఎలాంటి సమస్యలూ ఉండవనే విషయమై బోర్డు ఏకాభిప్రాయానికి వచ్చిందని తెలిపారు.

9న సాయంత్రం 6 గంటలకే తిరుమలలోని క్యూలైన్లు మూసివేస్తామన్నారు. అప్పటివరకు క్యూలు, కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు 11వ తేదీ మధ్యాహ్నానికి దర్శనం పూర్తవుతుందన్నారు. మహాసంప్రోక్షణ పూర్తయిన తరువాత 17న ఉదయం 6గంటలకు స్వామి దర్శనం పునఃప్రారంభమవుతుందని చెప్పారు. ఈ ఐదు రోజుల్లో ఆర్జితసేవలు, వీఐపీ బ్రేకు దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రభాత సేవను ఏకాతంగా నిర్వహిస్తామన్నారు. ఈ విషయంలో భక్తులు సహకరించి, తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని పుట్టా విజ్ఞప్తి చేశారు. సంప్రోక్షణ రోజుల్లో కాలినడక, రోడ్డుమార్గాలను మూసివేస్తామని తొలుత చైర్మన్‌ ప్రకటించారు. అయితే తిరుమలను నిర్మానుష్యం చేయడం సరికాదని, దర్శనం రద్దు చేసినా, ఇతర ప్రాంతాలను సందర్శించుకు నే అవకాశం ఉండాలని మీడియా ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే ఈవో, జేఈవోలతో చర్చించిన అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ భక్తులు తిరుమలకు రావడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవని, కేవలం దర్శనం మాత్రం ఉండదని స్పష్టం చేశారు. దీనిపై శ్రీవారి సేవకులతో, బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా, అలిపిరిలో కరపత్రాలను అందించి విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు.

మహాసంప్రోక్షణ ఎందుకంటే...

అష్టబంధన ద్రవ్యకాఠిన్యం పుష్కర కాలమే ఉంటుందని ఆ తర్వాత స్వామి విగ్రహానికి దివ్యశక్తిని, తేజస్సును ఆవాహనం చేయాలని, సువర్ణాన్ని తిరిగి తేజోవంతం చేయాలని ఆగమ వచనం. దీనిప్రకారం 12ఏళ్లకోసారి గర్భాలయంలో మరమ్మతులు, పీఠానికి బంధనం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామి బింబమును, ఆనంద నిలయాన్ని తేజోవంతం చేయడం, మహా సంప్రోక్షణ ఆగమోక్తంగా పంచాహ్నిక దీక్షతో చేయడం ఆచారంగా వస్తోంది.

టీటీడీ చరిత్రలో మొదటి ‘సారీ’

శ్రీవారి దర్శనాన్ని వరుసగా ఆరు రోజుల పాటు నిలిపివేయడం టీటీడీ చరిత్రలో ఇదే ప్రథమం. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం సందర్భంగా కొన్ని గంటల పాటు ఆలయాన్ని మూసివేసి దర్శనాలకు అనుమతించకపోవడం తెలిసిందే. అయితే పుష్కరానికోసారి జరిగే మహాసంప్రోక్షణ సందర్భంగా ఈసారి దర్శనానికి ఇన్ని రోజులు బ్రేక్‌ పడటం భక్తకోటిని విస్మయపరిచింది. 1958నుంచి ఐదుసార్లు మహాసంప్రోక్షణ జరిగినప్పటికీ అప్పట్లో భక్తుల రద్దీ తక్కువ ఉండటంతో వచ్చినవారందరికీ దర్శనం కల్పించేవారు. అయితే ఈ పదేళ్లలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగి పోవడంతో వైదిక కార్యక్రమాలకు అంతరాయం లేకుండా ఉండేందుకు టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల 11న అంకురార్పణతో మహోసంప్రోక్షణ క్రతువు ప్రారంభమవుతుంది. మహాసంప్రోక్షణలో భాగంగా గర్భాలయంతో పాటు విమాన ప్రాకారం, ఆనందనిలయం పైభాగంలో, ఇతర దేవతామందిరాల్లో కూడా మరమ్మతులు చేపడతారు. ప్రతినిత్యం మూడుపూటలా నివేదన, ఇత్యాది కైంకర్యాలు నిర్వహించడానికి మరికొంత సమయం కేటాయించాలి. దీంతో దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు.

తిరుమలేశునికి 13.5కోట్లు

శ్రీవారికి ఇద్దరు ప్రవాసాంధ్రులు రూ.13.5 కోట్లు విరాళంగా సమర్పించారు. అమెరికాలో స్థిరపడిన పారిశ్రామికవేత్తలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌ శనివారం తిరుమల వచ్చి స్వామిని దర్శించుకున్నారు. రంగనాయకుల మంటపంలో విరాళాలకు సంబంఽధించిన డీడీలను టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌కు అందజేశారు. ఒకే దాతనుంచి రూ.10కోట్లు అందడం విశేషమని పుట్టా పేర్కొన్నారు.

సవ్యంగా సాగడానికే...

భక్తుల రద్దీని దృష్టి లో పెట్టుకునే టీటీడీ నిర్ణయం తీసుకుంది. స్వామి దర్శనానికి కొం డకు చేరుకుని ఇబ్బందులు పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భక్తుల ఇక్కట్లు తొలగటం తో పాటు మహాసంప్రోక్షణలో భాగం గా ఆలయంలో జరిగే వైదిక కార్యక్రమాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సవ్యంగా సాగుతాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనా డు, కర్ణాటక నుంచి ఉద్దండులైన వైఖానస పండితులు, రుత్వికులు, స్వాములు వస్తారు. - వేణుగోపాల దీక్షితులు, ప్రధాన అర్చకులు, తిరుమల
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment