స్పై @ గూఢచోరీ!

తమిళనాడులో మొన్నీ మధ్యే జరిగిన ఓ సంఘటన. ఎంసీఏ చదివిన యువకుడు టెక్నాలజీ సపోర్టుతో అమ్మాయిల స్మార్ట్‌ఫోన్‌ని ఆసరాగా చేసుకుని 80 మంది వ్యక్తిగత వివరాల్ని సేకరించాడు. పలువురిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. వరుసకి సోదరి అయిన మహిళనూ వేధించాడు. అందుకు కారణం ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన స్పై యాప్‌.

ఫోన్‌ అంతా యాప్‌ల మయమే ఎన్నో ఇన్‌స్టాల్‌ చేస్తాం. వాడతాం. తీసేస్తాం. మరి, మీకు తెలియకుండా పాగా వేసిన యాప్‌ల సంగతేంటి? ‘మాకు తెలియకుండా మా ఫోన్‌లో యాప్‌లా? అదెలా సాధ్యం?’ అనుకునేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. స్పై యాప్‌ల గురించి. అవి ఎప్పుడు ఏ రూపంలో ప్రవేశిస్తాయో మీకే తెలీదు. జర జాగ్రత్త.

   నేను డాక్టర్‌, ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అని చెప్పి మారు పేర్లతో అమ్మాయిలకు దగ్గరయ్యాడు కులదీప్‌. వాస్తవానికి తను చదివింది ఇంటర్‌. సోషల్‌ నెట్‌వర్క్‌లో ప్రావీణ్యం సంపాదించి, కొంత మంది అమ్మాయిల ఫ్రొఫైల్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నాడు. వారితో స్నేహం పెంచుకున్నాడు. వాట్సాప్‌తో మరింత దగ్గరయ్యాడు. బాగా నమ్మకం కుదిరాక గేమ్స్‌, ఇతర ఎంటర్‌టైన్మెంట్‌ యాప్‌ల పేరుతో కొన్ని లింక్‌లు పంపాడు. వాటిని క్లిక్‌ చేయడం ద్వారా ఫోన్‌లను తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడు. ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత వివరాలు, కాల్స్‌... ఇలా డేటా మొత్తాన్ని యాక్సెస్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలెట్టాడు. అంతటికీ కారణం ఓ చిన్న మొబైల్‌ అప్లికేషన్‌.

వాట్సాప్‌లో గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఓ మెసేజ్‌. ఎవరో తెలీదు. కానీ, షేర్‌ చేసింది మాత్రం ఆన్‌లైన్‌ అంగళ్లలోని సూపర్‌ డీల్‌. పంపింది తెలిసినవారై ఉంటారులే అని క్లిక్‌ చేస్తారు. తీరా చూస్తే లింక్‌లో సంబంధంలేని విషయాలేవో కనిపిస్తుంటాయి. ఏంటబ్బా!! అని లింక్‌లోనే అదీ.. ఇదీ వెతుకుతుంటారు. ఈలోపు స్పైవేర్‌ ఫోన్‌లో సెటిల్‌ అయిపోతుంది.

పెళ్లి చూపులయ్యాయి. నిశ్చితార్థానికి ముందే ఇరువురూ ఫోన్‌ మాట్లాడుకోవడం.. ఫొటోలు షేర్‌ చేసుకోవడం... చేసేవారు. అయితే, అబ్బాయికి అమ్మాయిపై అనుమానం. దీంతో తనకి తెలియకుండా స్పై యాప్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేశాడు. అది మొదలు తనకి సంబంధించిన మొత్తం డేటాని సేకరించాడు. అయితే, అమ్మాయిని అనుమానిస్తున్నాడని తెలిసిన ఆడపెళ్లివారు పెళ్లి వద్దనుకున్నారు. దీంతో అబ్బాయి కోపంతో తను సేకరించిన ఫొటోలు, వీడియోలు, ఇతర వ్యక్తిగత వివరాల్ని సోషల్‌ మీడియాల్లో పోస్ట్‌ చేస్తూ పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు.

చెప్పాలంటే... ఇలాంటి స్పైవేర్‌ దాడులు ఎన్నో. క్షణాల్లో నిక్షిప్తమయ్యే అతి చిన్న మొబైల్‌ అప్లికేషన్‌తోనే ఈ దాడులు చేస్తున్నారు. వీటిని టెక్నాలజీ పరిభాషలో ‘మొబైల్‌ ట్రాకింగ్‌ యాప్స్‌’ అని పిలుస్తున్నారు. డెవలపర్లు వీటిని రూపొందించే ఉద్దేశం వేరు. స్మార్ట్‌ఫోన్‌లలో పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి... లేదంటే ఉద్యోగులు ఎంత సమయం పాటు వారి ఫోన్లలో ఏమేం చేస్తున్నారో ట్రాక్‌ చేసేందుకు వీటిని అందుబాటులోకి తెచ్చారు. అయితే, హ్యాకర్లు వీటితోనే వల పన్నుతున్నారు. చిటికెలో ఇన్‌స్టాల్‌ చేసి ఎస్‌ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌లు, కాల్‌ లాగ్‌, జీపీఎస్‌, మెయిల్స్‌, ఫొటోలు, వెబ్‌ హిస్టరీ.. ఇలా అన్ని వివరాల్ని సేకరించేస్తున్నారు. మీకు అనుమానం వస్తోందా? మీ ఫోన్‌లోనూ ఇలాంటి యాప్‌లు ఏవైనా ఇన్‌స్టాల్‌ అయ్యుండొచ్చా? తెలుసుకోవాలంటే? తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఏం చేయాలి?

  * అనుకోకుండా ఫోన్‌ ఇతరులకు ఇచ్చుంటారు. డెస్క్‌లో వదిలేసి కొన్ని సార్లు బయటికి వెళ్లుంటారు. డౌట్‌గా అనిపిస్తే స్పై యాప్‌లు ఏమైనా ఉన్నాయో చెక్‌ చేసుకోండి. వాడుతున్న ఫోన్‌ ఆండ్రాయిడ్‌ అయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్‌లను చెక్‌ చేయండి. ప్రధానమైన యాప్‌లను అన్నీ ప్లే స్టోర్‌ నుంచే ఇన్‌స్టాల్‌ చేస్తాం. స్పై యాప్‌లు మాత్రం ‘ఏపీకే’ ఎక్స్‌టెన్షన్‌తో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలాంటి అప్లికేషన్‌ సెట్‌లు ఏవైనా ఉంటే వెంటనే తొలగించండి.

* మీ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ద్వారా ఏవైనా లింక్‌ల రూపంలో ఇన్‌స్టాల్‌ చేసుకోమని అడిగితే కచ్చితంగా ఆలోచించాలి. అవి ఎలాంటి యాప్‌లు. వాటి ఉద్దేశం ఏంటో పరిశీలించాకే ఇన్‌స్టాల్‌ చేయండి. తర్వాత కూడా వాటిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి.

* మానిటరింగ్‌ టూల్స్‌, యాప్‌లు ఏవైనా ఈ-మెయిల్‌ ఐడీతో రిజిస్టర్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనధికారికంగా మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌ల్లో మెయిల్‌ ఐడీ ఏముందో చెక్‌ చేయాలి. మీది కాకుండా మరెవరిదైనా ఉంటే అనుమానించాలి. ఎందుకంటే.. రిజిస్టర్‌ చేసిన మెయిల్‌ ఐడీకే మొత్తం యాక్టివిటీ వివరాలు చేరతాయి. కాల్‌ లాగ్స్‌, మెసేజ్‌లు, కాల్‌ రికార్డింగ్‌లు, ఇతర డేటా ఏదైనా సరే. అందుకే ఇన్‌స్టాల్‌ చేసిన యాప్స్‌ అన్ని ఏయే మెయిల్‌ ఐడీతో రిజిస్టర్‌ అయి ఉన్నాయో చెక్‌ చేయండి. వేరే మెయిల్‌ ఐడీలను గుర్తిస్తే తొలగించి మీ మెయిల్‌ని సెట్‌ చేయండి.

* యాప్‌లను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయకపోయినా.. మీరు నెంబర్‌ని వాడుకుని ఇతరులు యాప్‌లను ప్రయత్నించొచ్చు. అప్పుడు మీ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని తెలుసుకుంటే చాలు. మీ ఎకౌంట్‌ వారిది అవుతుంది. మీ ప్రమేయం లేకుండా ఏదైనా మానిటరింగ్‌ యాప్‌కు సంబంధించిన ఓటీపీలు మీ ఫోన్‌కి వస్తే లైట్‌ తీసుకోవద్దు. మీ పేరుతో ఎవరో యాప్‌ని వాడేందుకు ప్రయత్నిస్తున్నారు అనే విషయాన్ని గ్రహించాలి. నిశిత పరిశీలనతో జాగ్రత్త పడాలి. ఉదాహరణకు వాట్సాప్‌ యాప్‌. మీరు వాడుతున్న నెంబరుతోనే మీ గురించి తెలుసుకోవాలి అనుకునేవారు వాట్సాప్‌ని వారి ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసే ప్రయత్నం చేస్తారు. అందుకు మీ ఫోన్‌కి వచ్చే ఓటీపీ అవసరం అవుతుంది. కొన్ని సెకన్ల పాటు మీ ఫోన్‌ని యాక్సెస్‌ చేయగలిగితే చాలు. వారి పని ముగిసిపోతుంది. మీరు మీ ఫోన్‌లో వాట్సాప్‌ ద్వారా ఏం చేస్తున్నారో వారికి తెలిసిపోతుంది. లేదంటే.. మీ ఫోన్‌తో వెబ్‌ వాట్సాప్‌ క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసినా బ్రౌజర్‌లో నిత్యం మానిటర్‌ చేయొచ్చు. ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు వెబ్‌ వాట్సాప్‌లో లాగిన్‌ అయ్యి ‘లాగ్‌అవుట్‌ ఫ్రమ్‌ ఆల్‌ డివైసెస్‌’ తప్పక చేయాలి.

* యాప్‌లను వాడాలన్నా.. క్యాబ్‌ బుక్‌ చేయాలన్నా.. జీపీఎస్‌ లొకేషన్‌ని ఎనేబుల్‌ చేయక తప్పదు. కొన్ని సార్లు అవసరం లేకపోయినా లొకేషన్‌ని ఎనేబుల్‌ చేసే ఉంచుతాం. ఇలా చేయడం మంచిది కాదు. అవసరం లేనప్పుడు డిసేబుల్‌ చేయండి. దీంతో గుట్టుగా ఏవైనా మానిటర్‌ యాప్‌లు మీపై నిఘా వేసినా మీరెక్కడ ఉన్నారో వారికి తెలియడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే, మీరేదైనా క్యాబ్‌ బుక్‌ చేసినప్పుడు లొకేషన్‌ ఎనేబుల్‌ చేస్తారు. డ్రైవర్‌కి మీ లొకేషన్‌ యాక్సెస్‌ వస్తుంది. అతనికి మీ నెంబర్‌ తెలియదు. ప్రత్యేక ఇంటర్ఫేస్‌ ద్వారా కాల్‌ కనెక్ట్‌ అవుతుంది. ప్రయాణికుల ప్రైవసీ నిమిత్తం డ్రైవర్‌కి ఫోన్‌ నెంబర్‌ని విజిబుల్‌ కాకుండా చేస్తారు. అయితే, మీ అంతట మీరుగా డ్రైవర్‌కి ఫోన్‌ చేస్తే మాత్రం డ్రైవర్‌కి నెంబర్‌ కనిపిస్తుంది. అంటే.. డ్రైవర్‌కి మీ లొకేషన్‌ యాక్సెస్‌తో పాటు మీ నెంబర్‌ కూడా తెలుస్తుంది. దీంతో ఎప్పుడైనా మీ నెంబర్‌ని హ్యాక్‌ చేసి మీరెప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ట్రాక్‌ చేయొచ్చు.

* మీరు వాడుతున్న మొబైల్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన కొన్ని ప్రత్యేక డయల్‌ కమాండ్స్‌ ఉంటాయి. వాటిని వాడుకుని కొన్ని ప్రత్యేక సౌకర్యాల్ని (ఐఎంఈఐ, కాల్‌ఫార్వర్డు...) ఎనేబుల్‌ చేస్తుంటాం. ఆయా కమాండ్స్‌ని ఆసరాగా చేసుకుని మీ మొబైల్‌ నుంచి కొన్ని సెకన్లలోనే ఇతరులు వారి మొబైల్‌ నెంబర్‌ని జత చేసి డయల్‌ చేయడం ద్వారా కొన్ని అనుమతుల్ని పొందుతారు. దీంతో మీ కాల్‌లాగ్‌ని ఎప్పటికప్పుడు ఇతరులు యాక్సెస్‌ చేయొచ్చు. కాల్‌ ఫార్వర్డు ద్వారా మీరు లిఫ్ట్‌ చేయని వాటిని వాళ్లు స్వీకరించొచ్చు. ఇలా డయల్‌ కమాండ్స్‌ ద్వారా మీకు తెలియకుండా మీ నెంబర్‌ నుంచే యాక్సెస్‌ తీసుకుంటారు. ఇలాంటివి ఏవైనా ఎనేబుల్‌ అయ్యాయేమో తెలుసుకునేందుకు సెట్టింగ్స్‌లో చెక్‌ చేసుకోండి.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment