ఎవరో చెప్పేస్తుంది!ట్రూకాలర్‌ అప్లికేషన్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే ట్రూకాలర్‌ వలన ఏమైనా ప్రమాదం ఉంటుందా వంటి అనేక సందేహాలు చాలామందిని చుట్టుముడుతుంటాయి. వాటి గురించి తెలుసుకోవడంతో పాటు ట్రూకాలర్‌లో ఉన్న కొన్ని టెక్నిక్‌ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

ట్రూకాలర్‌ ఎలా పనిచేస్తుంది?
ట్రూకాలర్‌ అనేది ఒక గ్లోబల్‌ డేటాబేస్‌. ఒక్కసారి దీన్ని మనం మన ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత కాంటాక్ట్స్‌ పర్మిషన్‌ తీసేసుకొని మన ఫోన్‌బుక్‌ =లో ఉన్న అన్ని కాంటాక్టులను ఇది ట్రూ కాలర్‌ సర్వర్‌లోకి అప్‌లోడ్‌ చేసేస్తుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ట్రూకాలర్‌ వినియోగదారుల ఫోన్‌ బుక్స్‌ మొత్తం ట్రూ కాలర్‌ వద్ద స్టోర్‌ అయి ఉంటాయి. అంటే కోట్లాది మంది ప్రజల పేర్లు, ఫోన్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడిలు ట్రూకాలర్‌ వద్ద ఉంటాయన్నమాట. 1234567890 అనే నెంబర్‌ నుండి మీకు ఫోన్‌ కాల్‌ వచ్చినట్లయితే, ఒకవేళ అప్పటికే ఆ నెంబర్‌ మీ ఫోన్‌బుక్‌లో లేకపోయినా.. ఆ నెంబర్‌ ట్రూ కాలర్‌ డేటాబేస్‌లో లభిస్తుందేమోనని కాల్‌ వచ్చిన కొద్ది క్షణాల్లోనే వెదకడం మొదలు పెడుతుంది. ఒకవేళ నా ఫోన్‌బుక్‌లో ఆ నెంబర్‌ ఉండి, ఆ నెంబర్‌ను నేను శ్రీధర్‌ నల్లమోతు అనే పేరుతో సేవ్‌ చేసుకున్నాను అనుకుందాం. అలాగే నేను ట్రూకాలర్‌ వాడుతున్నాను అనుకుంటే, నా ఫోన్‌బుక్‌ ఉన్నది ఉన్నట్లు ట్రూ కాలర్‌ డేటాబేస్‌లోకి అప్‌లోడ్‌ అయిపోతుంది కాబట్టి.. ఇకపై 1234567890 నెంబర్‌ నుండి మీకు కాల్‌ వచ్చినప్పుడు శ్రీధర్‌ నల్లమోతు అనే పేరే మీకు ఆటోమేటిక్‌గా చూపించబడుతుంది.

ట్రూ కాలర్‌ సేఫేనా?
చాలామంది మధ్య ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఒక ఆన్‌లైన్‌ సర్వీస్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫోన్‌బుక్‌లను సేకరించి తన వద్ద స్టోర్‌ చేసుకోవడం ప్రైవసీని కోరుకునే వారికి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. అయితే ట్రూకాలర్‌ గతంలో ఎప్పుడు వినియోగదారుల ఫోన్‌బుక్‌లను దుర్వినియోగం చేసిన సంఘటనలు వెలుగు చూడలేదు. కాబట్టి పెద్దగా వర్రీ అవ్వాల్సిన పనిలేదు. ఇకపోతే సెక్యూరిటీ పరంగా చూస్తే ఇంత పెద్ద మొత్తంలో పబ్లిక్‌ డేటాతో డేటాబేస్‌ కలిగి ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అది హ్యాకర్ల బారిన పడొచ్చు. గతంలో ఒకసారి ట్రూ కాలర్‌ సర్వీస్‌ హ్యాకింగ్‌కి గురైంది కూడా. అయితే ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కేవలం ట్రూకాలర్‌ మాత్రమే కాదు గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి ఎలాంటి ఆన్‌లైన్‌ సర్వీస్‌ అయినా హ్యాకింగ్‌కి అతీతం కాదు కాబట్టి ఆయా సంస్థలు తీసుకునే సెక్యూరిటీ జాగ్రత్తల మీద నమ్మకం ఉంచడం తప్పించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒకవేళ అంతగా భయం ఉంటే ట్రూకాలర్‌ తొలగించుకోవచ్చు కూడా!

పేరు తొలగించొచ్చా?
ట్రూ కాలర్‌లో మీ పేరు తెలియని కొత్త వ్యక్తులకు అది కనిపించకుండా దాచి పెట్టుకోవడానికి కూడా సాధ్యపడుతుంది. దీనికోసం మొదట మీ ఫోన్లో ట్రూకాలర్‌ అప్లికేషను ఓపెన్‌ చేసి మెనూలోకి వెళ్లి ప్రైవసీ సెంటర్‌ అనే విభాగంలో అన్నింటికంటే అడుగున డీయాక్టివేట్‌ అని కనిపిస్తుంది, దాన్ని ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత https://www.truecaller.com/unlisting అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి అన్‌లిస్ట్‌ ఫోన్‌ నెంబర్‌ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే చాలు. ఇకపై మీ ఫోన్‌ నెంబర్‌కి మీ పేరు కొత్త వ్యక్తులకు చూపించబడదు.

కాంటాక్టులు బ్యాకప్‌
దాదాపు ప్రతి ఒక్కరి ఫోన్‌లోనూ గూగుల్‌ కాంటాక్ట్స్‌ ఉంటాయి కాబట్టి, లేదా ఐఫోన్‌ వాడేవారికి ఐ క్లౌడ్‌ ఉంటుంది కాబట్టి కాంటాక్టుల బ్యాకప్‌ గురించి మనం పెద్దగా ఆలోచించం. అయితే ఎప్పటికప్పుడు మీ ఫోన్‌లో ఉన్న కాంటాక్టులు అన్నీ బ్యాకప్‌ తీసుకోవాలంటే ట్రూకాలర్‌ అప్లికేషన్‌లో కూడా ఆప్షన్‌ లభిస్తోంది. దీనికోసం మెనూలో సెట్టింగ్స్‌లో బ్యాకప్‌ అనే విభాగంలోకి వెళ్లి మీ గూగుల్‌ డ్రైవ్‌ ఎకౌంట్‌ ఎంపిక చేసుకొని బ్యాకప్‌ తీసుకోవచ్చు. ఇది కాల్‌ హిస్టరీ, కాంటాక్టులు, బ్లాక్‌లిస్ట్‌ వంటి డేటా మొత్తాన్ని మీ గూగుల్‌ డ్రైవ్‌లోకి బ్యాకప్‌ తీస్తుంది. తర్వాత అవసరమైన ప్పుడు రీస్టోర్‌ చేసుకోవచ్చు.

కెమెరా ద్వారా నెంబర్లు చూడడం
ట్రూ కాలర్‌ లో ఏదైనా నెంబర్‌ వెదకాలంటే దాన్ని కష్టపడి టైప్‌ చేయాల్సిన పనిలేదు. ఒకవేళ అది ఎక్కడైనా ప్రింట్‌ చేయబడి గానీ, లేదా ఏదైనా బోర్డు మీద రాయబడి గానీ ఉన్నట్లయితే.. సింపుల్‌గా ట్రూకాలర్‌ అప్లికేషన్‌ ఓపెన్‌ చేసి మెనూలోకి వెళ్లి స్కాన్‌ ఎ నెంబర్‌ అనే ఆప్షన్‌ ఎంచుకుంటే కెమెరా ఓపెన్‌ అవుతుంది. ఫోన్‌ నెంబర్‌ కెమెరాలో చూపిస్తే వెంటనే ఆ నెంబర్‌ ఎవరిదో ట్రూ కాలర్‌ ఆన్‌లైన్‌లో చెక్‌ చేసి చెప్పేస్తుంది.

బిల్‌ చెల్లింపులు చేసుకోవచ్చు
తరచూ చెల్లించాల్సిన బిల్లులను, మొబైల్‌ రీఛార్జ్‌లను ఈ అప్లికేషన్‌ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యుపిఐ ఆధారంగా పనిచేసే భీమ్‌ అప్లికేషన్‌ సాయంతో ఈ ట్రూకాలర్‌ బిల్లు చెల్లింపులను చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 80 సర్వీస్‌ ప్రొవైడర్లకు చెందిన బిల్లులను దీని ద్వారా చేసుకోవచ్చు.

బ్యాంకింగ్‌ సేవలు
స్నేహితులకు సులభంగా డబ్బు పంపాలన్నా కూడా సింపుల్‌గా వారి మొబైల్‌ నెంబర్‌ ఆధారంగా డబ్బులు పంపొచ్చు, వారి నుండి డబ్బులు స్వీకరించవచ్చు. మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌తో లింక్‌ చేయబడి ఉన్న బ్యాంక్‌ అకౌంట్లు అన్నీ ఈ యాప్‌లో చూపించబడతాయి. వాటి ద్వారా లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. అంతేకాదు మీ అకౌంట్లలో బ్యాలెన్స్‌ ఎంత ఉందో కూడా ట్రూ కాలర్‌ అప్లికేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

కాల్‌ రికార్డింగ్‌
ఇటీవల ట్రూకాలర్‌ ప్రీమియం వెర్షన్‌ వాడుతున్న వారి కోసం ఫోన్‌ కాల్స్‌ రికార్డ్‌ చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే దీనికోసం తప్పనిసరిగా అదనంగా డబ్బులు చెల్లించి ప్రీమియం వెర్షన్‌ వాడాల్సి ఉంటుంది. ట్రూకాలర్‌ యాప్‌ ఒకేసారి పలు ప్రాసెస్‌లను ఆండ్రాయిడ్‌లో రన్‌ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఇది వాడేటప్పుడు ఫోన్‌ కొద్దిగా స్లో అయ్యే అవకాశాలున్నాయి. శక్తివంతమైన ఫోన్లు వాడే వారికి ఈ వ్యత్యాసం పెద్దగా తెలీదు గానీ తక్కువ మెమొరీ ఉంటే స్లో అయిన విషయం అర్థమవుతుంది.

కాల్‌ వెయిటింగ్‌ వస్తే!
మిత్రులకు మన ఫోన్‌ చేసినప్పుడు కొన్నిసార్లు వారు ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం వలన కాల్‌ వెయిటింగ్‌ వస్తుంది కదా. అయినప్పటికీ మనం కాల్‌ చేసిన విషయం వారికి తెలుస్తుంది. ఫోన్‌ పెట్టేశాక మనకు కాల్‌ చేద్దాం అనుకుని మర్చిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ట్రూకాలర్‌ అప్లికేషన్లో కాల్‌ మీ బ్యాక్‌ అనే ఆప్షన్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇది అవతలివారు ఫోన్‌ పెట్టేసిన వెంటనే.. మనం కాల్‌ చేసాం అన్న విషయం గుర్తు చేస్తూ వారి ఫోన్‌ స్ర్కీన్‌ మీద ఒక ఫుష్‌ నోటిఫికేషన్‌ చూపిస్తుంది.    -నల్లమోతు శ్రీధర్‌

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment