తిరుమలలో నేటి నుంచే మహా క్రతువు.. ఏ రోజు ఏం జరుగుతుంది? 

మహా సంప్రోక్షణకు నేడు అంకురార్పణ
తిరుమలలో ఏర్పాట్లు పూర్తి
రేపటి నుంచి కీలక ఘట్టం
కొండకు చేరుకున్న రుత్వికులు
నేడు వారికి స్థాన నిర్ణయం
యాగాలు, పారాయణాలతో ఘనంగా వేడుక

    తిరుమల, ఆగస్టు 10 శ్రీవెంకటేశ్వరుడి ‘పుష్కర సేవ’కు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఈనెల 16వ తేదీ గురువారం వరకు ఆగమోక్తంగా ‘మహా సంప్రోక్షణ’ జరగనుంది. శనివారం అంకురార్పణతో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి ఆలయ యాగశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించే క్రతువులో ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో 45మంది రుత్వికులు, వందమంది వేదపండితులు, 20మంది వేదపాఠశాల విద్యార్థులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆనందనిలయంలో వెంకటేశ్వరస్వామి కొలువైన పీఠాన్ని అష్టవిధ ద్రవ్యాలతో బలోపేతం చేస్తారు. స్వామివారి దివ్య తేజస్సును కలశంలో ఆవహించేలా చేస్తారు. గర్భాలయంలో, ఇతర కీలక ప్రాంతాల్లో అవసరమైన మరమ్మతులు కూడా చేస్తారు.

మూడు రాష్ర్టాల నుంచి రుత్వికులు
మహత్తర క్రతువైన మహా సంప్రోక్షణ శాస్ర్తోక్తంగా జరిపించేందుకు మూడు రాష్ట్రాల నుంచి 30 మంది రుత్వికులను ఆహ్వానించారు. టీటీడీకి చెందిన అనుభవం కలిగిన మరో 14 మంది అర్చకులు కూడా రుత్వికులుగా వ్యవహరించనున్నారు. రుత్వికుల స్థాన నిర్ణయాన్ని శనివారం అంకురార్పణ సందర్భంగా శ్రీనివాసుడి సమక్షంలో నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియను ఆచార్యవరణం అంటారు. ప్రధానాచార్యుడు, రుత్వికులు, వైఖానస పరిచారకులు యాగశాలలో ఏర్పాటు చేసిన 28 హోమగుండాల వద్ద తమ తమ బాధ్యతలు నిర్వహిస్తారు. అలాగే యాగశాల ప్రాంగణంలో వేదపారాయణదారులు వేదమంత్రాలు, చతుర్వేద పారాయణం చేస్తారు. పురాణపండితులు మహాభారతం, రామాయణం, భగవద్గీత పారాయణం చేస్తారు. దివ్య ప్రబంధనదారులు ప్రబంధాలను పఠనం చేస్తారు. ఈ ప్రక్రియంతా ఓ దీక్షలా జరుగుతుంది.

రుత్వికులకు బంగారు రక్షాబంధనం
సంప్రోక్షణ ప్రారంభయ్యే మొదటిరోజు ఆదివారం ఉదయం 6 గంటలకు ఆలయంలో హోమగుండాలు వెలిగిస్తారు. ఆ తర్వాత పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం నిర్వహిస్తారు. అనంతరం మహాసంప్రోక్షణ జరిగినన్ని రోజులు రుత్వికులు రక్షాబంధనం ధరించాలి. ఈసారి టీటీడీ సుమారు 2 గ్రాముల బరువైన బంగారు రక్షాబంధనం చేయించింది.

ఏ రోజు ఏం జరుగుతుంది?
శనివారం... ఉదయం భగవంతుని అనుమతితో ఆచార్యులకు స్థాన నిర్ణయం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు విష్వక్సేనుల ఊరేగింపు, రాత్రి 9-10 గంటల మధ్య యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ!

ఆదివారం (మహాసంప్రోక్షణలో తొలిరోజు)
ఉదయం 6 గంటలకు యాగశాలలో హోమగుండాలను వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేస్తారు. రాత్రి 9 గంటల తరువాత కళాకర్షణలో భాగంగా గర్భాలయంతోపాటు అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం (కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతోపాటు అందరు దేవతల ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపుచేస్తారు. మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీస్తారు. యాగశాలలో ప్రతిరోజూ నిత్య కైంకర్యాలతో పాటు హోమాలు నిర్వహిస్తారు.

సోమ, మంగళవారాల్లో...
విశేష హోమాలతోపాటు ఎనిమిది రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. దీనిని గర్భాలయంలో పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, ఉప ఆలయాల్లో సమర్పిస్తారు.
బుధవారం.. ఉదయం కైంకర్యాల అనంతరం మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గర్భాలయంలోని మూలవర్లకు 14 కలశాలతో మహాశాంతి తిరుమంజనం చేస్తారు. అదే సమయంలో యాగశాలలోని ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.

గురువారం (చివరి రోజు)
ఉదయం 10.16 గంటల నుంచి మధ్యాహ్నం 12లోపు కళావాహన చేస్తారు. మూలమూర్తికి, విమానగోపురానికి, ఉప ఆలయాల్లోని విగ్రహాలకు, గోపురాలకు కుంభంలోని శక్తిని తిరిగి ఆవాహనం చేస్తారు. ఆ తర్వాత ఆరాధన, వైవేద్యం, అక్షతారోపణం, బ్రహ్మఘోష, అర్చక బహుమానం సమర్పిస్తారు. ఈ కార్యక్రమంతో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు పరిసమాప్తమవుతుంది. చివరగా మలయప్పస్వామి పెద్దశేష, గరుడ వాహనాల్లో తిరువీధులలో ఊరేగుతూ భక్తకోటిని కటాక్షిస్తారు.

తొలి ‘సంప్రోక్షణ’ ఇలా...
శ్రీవారి ఆలయ నిర్వహణ బాధ్యతలు టీటీడీకి ఆధీనమైన తర్వాత... ప్రతి పన్నెండేళ్లకోసారి ఆనంద నిలయ విమాన జీర్ణోద్ధరణ చేపడుతున్నారు. తొలిసారిగా 1958లో ఆగస్టు 19నుంచి 27వరకు మహాసంప్రోక్షణ జరిగింది. అప్పటో 12 టన్నుల రాగి, 12 వేల తులాల మేలిమి బంగారాన్ని ఆనందనిలయ నవీకరణకు వినియోగించారు. అప్పటి లెక్కల ప్రకారం ఖర్చు సుమారు రూ.18 లక్షలు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment